ఆకెళ్ల రాఘవేంద్ర పుట్టింది ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న రాజమండ్రి. పెరిగినది కోనసీమలోని అమలాపురం ప్రాంతంలో. పదవ తరగతి వరకు మురమళ్ల ప్రభుత్వ పాఠశాలలో చదివి, ఆపై అమలాపురంలోని ఎస్ కె బి ఆర్ కళాశాలలో బి.ఎస్సీ వరకు విద్యాభ్యాసం చేశారు. తండ్రి పేరు సుబ్రహ్మణ్య శర్మ, తల్లి సూర్యకుమారీ లలిత. వీరికి గల ముగ్గురి సంతానంలో చివరివారు ఆకెళ్ల రాఘవేంద్ర. భార్య పేరు మాధవి. కుమార్తె సిరివెన్నెల; కుమారుడు సంకల్ప రుత్విక్.
డిగ్రీ పూర్తవగానే 1994లో రాఘవేంద్ర భారతదేశంలోని అత్యున్నత స్థాయి పరీక్ష అయిన IASకి సిద్ధమయ్యారు. కాని, ఇంటర్వ్యూ స్థాయి వరకు వెళ్లగలిగినా - చివరకు 12 మార్కుల్లో IASని కోల్పోయారు. అనంతరం 1997 నుంచి 2000 వరకు పాత్రికేయుడిగా ఈనాడు, ఈటీవీలలో పనిచేశారు. హైదరాబాద్, ఢిల్లీ, చెన్నైలలో వృత్తి పరమైన బాధ్యతలు నిర్వహించారు. అనంతరం, వెబ్‌దునియా.కామ్ వారి తెలుగు వెర్షన్ వెబ్‌ప్రపంచం.కామ్‌లో సీనియర్ కరస్పాండెంట్‌గా చేరి, చెన్నై విభాగానికి ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ ఉద్యోగంలో 2003 వరకూ పనిచేసి - ఆపై IAS విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. అప్పటి నుంచి దాదాపు 10 వేలమందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి - కొన్ని వందల మందిని అత్యున్నత సర్వీసులలో ప్రవేశించేలా చేసిన శిక్షకుడు, విద్యావేత్త ఆకెళ్ల రాఘవేంద్ర.
స్వామి వివేకానంద, జాన్ కీట్స్, మార్టిన్ లూథర్ కింగ్, బసవరాజు అప్పారావు, దామెర్ల రామారావు లాంటి చరిత్ర నిర్మాతల అడుగజాడల పుస్తకం ఇది. 40 ఏళ్ల లోపు మరణించిన మహానుభావుల సంక్షిప్త జీవిత చరిత్రల సంకలనం ఈ 'చెరగని ముద్రలు' - కడుపుకి తిండి, కంటికి నిద్ర, వేళకి పడక సుఖం - ఇందుకోసమే అయితే జంతువుగానే పుట్టొచ్చు. మానవ జన్మ ఎందుకు దండగ. ఎలా పుట్టిందో అలాగే ఉండి - పోయే గుణం జంతువుది. మనిషి అలా కాదు. అసాధ్యాల్ని సుసాధ్యం చేసే లక్షణం మానవులది. అలా చరిత్ర గతి మార్చిన వారి జీవిత కథలివి.
జీవితం చాలా చిన్నది. విలువైనది. దాన్ని ప్రయోజనకరంగా మలచుకోవాల్సింది మనమే. విసిరి పారేసిన పూలబుట్టకు, ముచ్చటగా పెంచిన పూలతోటకు ఎంత తేడా! స్టూడెంట్‌గా ఉన్నప్పుడు కెరీర్‌పై, ఉద్యోగం వచ్చాక కుటుంబం పట్ల, ఆపై సంఘం మీద దృష్టి పెట్టాలి ఎలా పుట్టామన్నది కాదు.. ఎందుకు పుట్టామన్నది ముఖ్యం. ఎందుకు చనిపోయామన్నది కాదు.. ఎలా వెళ్లిపోయామన్నది ప్రధానం. ఆనందం, ఆరోగ్యం, సత్కీర్తి, సంపద - ఈ నాలుగూ జీవిత సౌధానికి మూలస్తంభాలు కావాలి. సమస్యలు, సంక్షోభాలు, కోపాలు, వేదనలు.. సహజం. భయం నుంచి నిర్భయానికి, విషాదం నుంచి సంతోషానికి, వైఫల్యం నుంచి విజయానికి జీవిత ప్రస్థానం చేయడమే ప్రతి ఒక్క మనిషి కర్తవ్యం. ఈ పరిణామక్రమమే జీవితం అంటే.